Cyber Fraud | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అమెరికా పౌరుడిని మోసగించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డెలావేర్లో నివసిస్తున్న అమెరికాకు చెందిన వృద్ధుడి డ్రైవింగ్ లైసెన్స్ డిటైల్స్ ఆధారంగా ఆయన బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్లో మనీ దొంగలించడానికి సదరు వ్యక్తులు ప్రయత్నించారని కోల్కతా పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.
జార్జ్ అల్బర్ట్ స్కిల్ఫిన్ అనే 80 ఏండ్ల వృద్ధుడు తన ఖాతా నుంచి 10 వేల డాలర్లను సదరు నిందితులు కొట్టేయడానికి ప్రయత్నించారు. ఈ సంగతి గుర్తించిన సదరు వ్యక్తి.. డబ్బులు నష్టపోకుండా నివారించగలిగాడు. తన ఖాతా నుంచి కొందరు క్రిమినల్స్ మనీ తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారని వృద్ధుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎఫ్బీఐ పోలీసులు.. కోల్కతాలోని సైబర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు.
ఎఫ్బీఐ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కోల్కతా సైబర్ పోలీసు స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గత ఫిబ్రవరి 9 నుంచి 14 మధ్య జార్జ్ అల్బర్ట్ స్కిల్ఫిన్ బ్యాంక్ ఖాతా నుంచి మనీ తస్కరించడానికి సైబర్ మోసగాళ్లు ప్రయత్నించారని ఈ దర్యాప్తులో తేలింది. డిజిటల్ ఆధారాలను విశ్లేషించుకున్న తర్వాత ఎంటల్లీ ప్రాంతంలో వారిద్దరిని అరెస్ట్ చేశామని, వారివద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక లాప్టాప్ స్వాధీనంచేసుకున్నామని పోలీసులు చెప్పారు. అటుపై కోల్కతా నగర కోర్టులో ప్రవేశపెట్టగా, వచ్చే బుధవారం వరకు పోలీస్ కస్టడీ విధించింది.