మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 19:41:38

సినిమా కోసం దొంగలుగా మారిన సోదరులు

సినిమా కోసం దొంగలుగా మారిన సోదరులు

చెన్నై: నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన సినిమాను పూర్తిచేసేందుకు సోదరులు దొంగలుగా మారారు. రోజుకో ప్రాంతంలో మేకలు మాయం అవుతుండటంతో పోలీసులు నిఘా వేసి చివరికి సినిమా నిర్మాతలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల తండ్రి నిర్మిస్తున్న 'నీ థాస్ రాజా' సినిమాను పూర్తిచేయడానికి డబ్బులు లేక దొంగలుగా మారడం చెన్నైలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో సోదరులే హీరోలు కావడం మరో విశేషం.

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌ పేట్‌లో నివసించే విజయ్‌ శంకర్‌  'నీ థాస్ రాజా' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోలుగా ఆయన కుమారులు నిరంజన్‌కుమార్‌, లెనిన్‌కుమార్ నటిస్తున్నారు. కొంతకాలం షూటింగ్‌ చేసిన తర్వాత నిధుల కొరతతో నిలిచిపోయింది. దాంతో తండ్రి బాధను చూసి తట్టుకోలేని సోదరులు ఎలాగైనా సినిమాను పూర్తిచేసేలా చూడాలని భావించారు. చెంగల్‌పేట్, మిన్జూర్, పొన్నేరి, మాధవరం పరిసరాల్లో జంతువులను మేపడం చూసిన వీరు.. ప్రతిరోజూ 8-10 మేకలను దొంగిలించి ఒక్కొక్కటి రూ.8,000 రూపాయలకు అమ్మేవారు. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోతే మరిన్ని ఎక్కువ మేకలను కారులో ఎత్తుకెళ్లేవారు. అక్టోబర్ 9 వ తేదీన వీరు మాధవరం పళని ప్రాంతం నుంచి మేకను దొంగిలించారు. 6 మేకలు మాత్రమే ఉండటం.. అందులో నుంచి ఒక మేక తప్పిపోయిందని గమనించడంతో ఆ పశువుల కాపరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేసి నిందితులు కారులో వచ్చినట్లు గుర్తించారు. అయితే కారు రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకపోవడంతో పోలీసులు వెంటనే పట్టుకోలేకపోయారు. వీరిపై నిఘా వేసిన పోలీసులు మరో ప్రాంతంలో మేకలను దొంగిలించి తీసుకెళ్తుండగా శనివారం వీరిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తండ్రి ప్రారంభించిన సినిమాను పూర్తిచేయడానికి డబ్బులు లేక దొంగలుగా మారామని ఆ సోదరులు చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. మేకల దొంగలు దొరికిన విషయాన్ని స్థానిక పత్రికల్లో చూసిన పలువురు తమ మేకలు కూడా దొంగతనానికి గురయ్యాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo