కుత్బుల్లాపూర్,ఏప్రిల్8 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని జిల్లా ఎక్సైజ్ శాఖా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సూపరిండెంటెంట్ విజయభాస్కర్ వివరాలను వెల్లడించారు.
గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవాం ఉదయం కండ్లకోయలోని సుమన్ స్టీల్ కంపెనీ వద్ద ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో ఒడిషా రాష్ర్టానికి చెందిన కమలకాంత్ జేనా అలియాస్ ఖాలీ(32) బైక్‌పై 2.5 కిలోల ఎండు గంజాయిని విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుకొని విచారించామన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు దైతరి జేన అలియాస్ ఓమేష్(39), చంద్రదాస్ అలియాస్ అజయ్(43)ల నుంచి మరో 2.50 గ్రాముల గంజాయి పట్టుబడిందన్నారు.
దూలపల్లిలో నివాసం ఉంటున్న అజయ్ ఇంట్లో తనిఖీలు చేయగా మొత్తం 14 కేజీల గంజాయి లభించిందని ఆయన తెలిపారు. గంజాయితో పాటు మూడు ద్విచక్రవాహనాలు మొత్తం 6 లక్షల విలువ గల వాటిని సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించిన్నట్లు పేర్కొన్నారు. మత్తుకు బానిసలుగా మారుతున్న ఎన్నో కుటుంబాల్లో జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయని, నిషేదిత గంజాయి వంటి మత్తుపదర్థాలను నిషేదించేందుకు ప్రతి ఒక్కరు ముందకు రావాలన్నారు. ఇలాంటి వాటిని విక్రయిస్తున్నట్లు అనుమానం ఉంటే 9440902321 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.