వాషింగ్టన్ : అమెరికాలోని ఓ యాపిల్ (Apple ) స్టోర్‌లో దొంగలు చొరబడి భారతీయ కరెన్సీలో రూ. 4 కోట్ల విలువైన ఐఫోన్లను చోరీ చేశారు. వాషింగ్టన్‌లోని అల్డర్వుడ్ మాల్లో ఏర్పాటైన యాపిల్ స్టోర్‌లో ఈ ఘటన జరిగింది. సమీప కాఫీ షాప్ సీటెల్ కాఫీ గేర్ మీదుగా దొంగలు యాపిల్ స్టోర్‌లోకి చొరబడి వేలాది డాలర్ల విలువైన సెల్ఫోన్లను దొంగిలించారు.
తెల్లవారుజామున చోరీ జరగడంతో ఆ సమయంలో యాపిల్ స్టోర్‌లో ఉద్యోగులు సహా ఎవరూ లేరని సీటెల్ కాఫీ గేర్ సీఈవో మైక్ అట్కిన్సన్ ట్వీట్ చేశారు. తొలుత కాఫీ షాప్‌లోకి చొరబడిన దొంగలు బాత్రూం గోడను కట్ చేసి అందులోంచి యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారు. యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటే ఇలా జరుగుతుందని తానెన్నడూ ఊహించలేదని సీటెల్ కాఫీ గేర్ రీజినల్ రిటైల్ మేనేజర్ ఎరిక్ మార్క్స్ వాపోయారు.
బాత్రూం గోడ మరమ్మత్తులు, తాళాలు మార్చేందుకు తమకు రూ. 1.23 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. కాఫీ షాప్‌లోకి చొరబడిన దొంగలు సెక్యూరిటీ సిస్టం కండ్లు కప్పి యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి ఉంటారని, వారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చోరీకి తెగబడిఉంటారని మార్క్స్ అన్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా యాపిల్ తన స్టోర్‌లో చోరీ ఘటనపై ఇప్పటివరకూ స్పందించలేదు.
Read More
Apple | ముంబైలో తొలి రిటైల్ స్టోర్‌ను లాంఛ్ చేయనున్న యాపిల్ : ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లింప్స్