బెంగళూర్ : దేశంలో నకిలీ కొరియర్ స్కామ్‌లు (Cyber Fraud) పెరుగుతున్నాయి. గత కొద్ది వారాలుగా స్కామర్లు పోలీస్ అధికారులమని నమ్మబలుకుతూ బాధితులకు ఫోన్లు చేసి రూ. లక్షలు గుంజుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి చట్టవిరుద్ధమైన వస్తువులతో కూడిన పార్సిల్స్ తమ పేరుతో వచ్చాయని బెదిరిస్తారు. బాధితులు వారి వలలో పడగానే బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతారు.
ఇక లేటెస్ట్గా బెంగళూర్‌కు చెందిన టెకీ స్కామర్ల బారినపడి రూ. 33.24 లక్షలు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 39 ఏండ్ల టెకీకి జూన్ 29న ఓ ఫోన్ కాల్ వచ్చింది. స్కామర్ తాను ఫెడెక్స్ కొరియర్ సర్వీస్‌కు చెందిన వ్యక్తినని ఫోన్ చేసి మీ పేరుపై చట్టవిరుద్ధమైన వస్తువుల పార్సిల్ వచ్చిందని, దాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మభ్యపెట్టాడు. బాధితుడి ఆధార్ నెంబర్ ఉపయోగిస్తూ ఈ ప్యాకేజ్‌ను తైవాన్‌కు పంపుతున్నారని చెప్పుకొచ్చాడు. ఆపై ముంబై డీసీపీతో మాట్లాడాలంటూ మరో వ్యక్తికి కనెక్ట్ చేశాడు.
నకిలీ పోలీస్ అధికారి బాధితుడిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదైందని బెదరగొట్టాడు. ఈ కేసు వివరాలు మాట్లాడేందుకు స్కైప్ కాల్లో జాయిన్ కావాలని కోరాడు. కాల్లో జాయిన్ అయిన టెకీని వెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో పలు ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నకిలీ డీసీపీ సూచించాడు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డబ్బును రిఫండ్ చేస్తామని నమ్మబలికాడు. నకిలీ పోలీస్ అధికారి కోరిన విధంగా బాధిత టెకీ వివిధ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 33 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆపై తన డబ్బు రిఫండ్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన టెకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More :
Shocking incident | Open the door.. అంటూ టేకాఫ్ అవుతున్న విమానంలో యువకుడి వీరంగం..