చెన్నై : ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించి మహిళను డబ్బుల కోసం వేధించిన యువకుడి (29)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతం తమిళనాడులోని థేని జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని కన్నిసెర్వపట్టి గ్రామానికి చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ ఎం మనోజ్‌కుమార్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మనోజ్‌కుమార్ ఫోన్ ద్వారా బాధిత మహిళతో పరిచయం పెంచుకున్నాడు.
రాజ్ అనే పేరుతో ఆమెకు పరిచయమై దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడి ఉద్దేశాన్ని పసిగట్టలేని మహిళ అతడితో స్నేహాన్ని కొనసాగించింది. తన ఫోటోలు, వీడియోలు సైతం అతనికి పంపింది. ఆమె ఈ మెయిల్ వివరాలను కూడా రాబట్టిన నిందితుడు ఆమె కాంటాక్ట్ నెంబర్లనూ సేకరించాడు. ఆపై తన ఉద్యోగం పోయిందని రూ 50,000 డబ్బు పంపాలని ఆమెను కోరాడు.
దీంతో రూ 20,000 మనోజ్ ఖాతాకు ఆమె ట్రాన్ఫ్‌ఫర్ చేసింది. మిగిలిన రూ 30,000 ఇవ్వాలని లేకుంటే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను ఆమె బంధువులు, కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించాడు. నిందితుడి ఆగడాలు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.