తిరువనంతపురం : లైంగిక వేధింపుల కేసులో కేరళలో ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ అరెస్టయిన కొద్దిరోజుల తర్వాత మరో టాటూ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి కేసు నమోదైన ఉదంతం వెలుగుచూసింది. లైంగిక దాడి కేసులో కొచ్చి సిటీ పోలీసులు నగరంలోని మరో టాటూ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు చేశారు. తమ సంస్ధలో పనిచేసే మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడినందుకు దీప్లింక్ టాటూజ్ యజమానిపై పలరివట్టం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
నిందితుడిని కాసర్‌గాడ్‌కు చెందిన కుల్దీప్ కృష్ణగా గుర్తించారు. 2020లో టాటూలపై శిక్షణా తరగతులకు తనను ఎంపిక చేసిన తర్వాత కుల్దీప్ కృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. పెండ్లి పేరుతో తనను లోబరుచుకుని కొచ్చిలో పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని పేర్కొంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో లైంగిక వేధింపులకు గురిచేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
మరోవైపు తమ సంస్ధలో ఆమె ఆర్ధిక అవకతవకలకు పాల్పడిందని టాటూ స్టూడియో యాజమాన్యం ఫిర్యాదు చేయగా సంస్ధ యజమాని కుల్దీప్ కృష్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడికి వివాహమైందని బాధితురాలికి ముందుగానే తెలుసునని ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పారు.