Goa | పర్యాటకుల స్వర్గధామం.. గోవా. రాజధాని నగరం పనాజీ. అక్కడికి 28 కిలోమీటర్ల దూరంలోని ఖాందేపర్లో ఓ పూరిల్లు. అందులో గులాబీ అనే యువతి నివసించేది. ఆ ఇంట్లో చీకటి పడేవరకూ కుట్టుమెషిన్ శబ్దాలు వినిపించేవి. ఒకరోజు ఆమె హత్యకు గురైంది. ఎవరో తలపై బండరాయితో మోది చంపేశారు. దుర్ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం వెళ్లింది. ‘ఆమె రోజూ ఆటో స్టాండ్ దగ్గర ఒక గడ్డం మనిషితో మాట్లాడేది సార్’ అని పోలీసులకు చెప్పాడు విచారణలో ఓ సాక్షి. పోలికలను బట్టి మహానంద్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు ఖాకీలు. గులాబీ చనిపోయిన రోజు అతను ఆటో స్టాండ్ దగ్గరే ఉన్నాడని, ఎక్కడికీ వెళ్లలేదనీ ఇతర డ్రైవర్లు గట్టిగా చెప్పడంతో పోలీసులు మహానంద్‌ను వదిలేశారు. ఆ తర్వాత కూడా హత్యలు జరిగాయి. సీరియల్ హంతకుడు మాత్రం దొరకలేదు.
దర్శన పేదింటి బిడ్డ. వయసు ఇరవై. పనాజీ శివార్లలోని శిరోదాలో తల్లితో కలిసి జీవించేది. ఇద్దరూ వ్యవసాయ కూలీలే. హఠాత్తుగా ఓ రోజు చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించింది. మెడ చుట్టూ దుపట్టా. ఆ ముసలి తల్లికి ఇదో శరాఘాతం. దర్శన మరణానికి కారణాలు తెలియలేదు. కారకులెవరో గుర్తించలేకపోయారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కానీ ఆత్మ‘హత్య’లు మాత్రం ఆగలేదు. హంతకుడి వేలిముద్రలు మాత్రం ఒకే తీరుగా ఉన్నాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివన్నది తేల్చలేకపోయారు పోలీసులు. ఆ పేరు తెలియని హంతకుడికి ‘దుపట్టా కిల్లర్’ అని పేరు పెట్టుకున్నారు. గోవా ప్రజల్ని ఒకటిన్నర దశాబ్దం పాటు తీవ్రంగా భయపెట్టాయి ఆ హత్యలు.
దుపట్టా హత్యలన్నీ పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరోదా, పాండా, బిచోలిమ్, మర్గావ్, క్వీపెమ్ పట్టణాలలోనే జరిగాయి. అవివాహిత మహిళలను ఎంచుకుని.. కామ వాంఛ తీర్చుకుని.. దుపట్టాకు ఉరేసి చంపేడం ఆ క్రిమినల్ మోడస్ అపరాండి. మృతురాలి ఒంటిపై ఉన్న నగలన్నీ ఒలుచుకుని, చేతిలోని చిల్లర పైసలతో సహా దోచుకుని మాయమైపోవడం ఆ మృగాడికి అలవాటే. కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా వదిలేవాడు కాదు. మరొక్క విషయం.. హతులంతా నిరుపేదలే. అవివాహితలే. 20 నుంచి 35 ఏండ్లవారే. ఒక్క వసంతి మినహా. వసంతి పోండాలో పాచిపని చేస్తూ బతికేది. ఆమెకు పందొమ్మిదేండ్లు. తనూ ఓ ఉదయం శవమై తేలింది. ఆధారాలను బట్టి దీన్నికూడా దుపట్టా కిల్లర్ దుశ్చర్యగానే తీర్మానించారు క్రైమ్ పోలీసులు.
పోండాలో నివసించే 30 ఏళ్ల యోగితా నాయక్ కనిపించడం లేదని, తనతోపాటు 80 వేల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలను తీసుకుపోయిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే ఆమె ఒక జీడిమామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇంతకుముందు కేసుల్లో బాధితుల్లా కాకుండా యోగిత కుటుంబసభ్యులు పోలీసుల వెంటపడ్డారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాజకీయ నాయకులూ జోక్యం చేసుకున్నారు. దానికితోడు కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ చేతన్ యువకుడు, ఉత్సాహవంతుడు, నిజాయతీపరుడు. నేర పరిశోధన పట్ల ఆసక్తి ఉన్నవాడు. డిటెక్టివ్ నవలల స్ఫూర్తితో డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. వచ్చీరాగానే దుపట్టా కిల్లర్ కేసు సవాలుగా నిలిచింది. ఆసక్తికరంగానూ అనిపించింది. పాత ఫైళ్ల దుమ్ము దులిపాడు. వారంరోజులు ముందేసుకుని కూర్చున్నాడు. వర్చువల్ క్రైమ్ సీన్ క్రియేట్ చేశాడు. చిట్టచివరి హతురాలు యోగిత ఫోన్ కాల్ డాటా పరిశీలించాడు. చనిపోవడానికి ముందు ఆమె చేసిన రెండు కాల్స్ ఎవరివన్నది ఆరా తీశాడు. ఆ సిమ్ కార్డ్ గోవా ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన విద్యార్థి పేరున ఉంది. అతడిని పిలిపించాడు. ఆ యువకుడు పోలీసులను చూడగానే ఒణికిపోయాడు. ‘నేను ఏ తప్పూ చేయలేదు సార్’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్నిరోజుల క్రితం తన ఫోన్ పోయిందని చెప్పాడు. కాకపోతే, ఆ సిమ్ ఇంకా యాక్టివ్గానే ఉంది. ఆ నంబరు నుంచి ఒక మహిళకు తరచూ కాల్స్ వెళ్తున్నాయి. పోలీసులు ఆమె వివరాలు సేకరించారు. స్టేషన్‌కు పిలిపించారు. తనకు తాను అత్యాచార బాధితురాలిగా పోలీసులకు పరిచయం చేసుకుంది. అంతేకాదు ఆ ఘాతుకానికి పాల్పడిన వాడే తనకు తరచూ ఫోన్ చేస్తున్నాడని వివరించింది. సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నేరస్థుడిని వలపన్ని పట్టుకున్నారు. దుపట్టా కిల్లర్ దొరికిపోయాడనే వార్త గోవాలో గుప్పుమంది. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుకెక్కారు. ఆ దుర్మార్గుడి ఇంటిని తగులబెట్టారు. ఆ నేరగాడి పేరు.. మహానంద్! అవును, గులాబీ హత్యకేసులో పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్న నక్క జిత్తుల క్రిమినల్ ఇతనే.
టైలర్ గులాబీ హత్య కేసులో ఒక సాక్షి మాటల్ని పోలీసులు అమాయకంగా నమ్మేయడం వల్లే ఇన్ని హత్యలు జరిగాయి. అలా అని ఆ సాక్ష్యమూ అబద్ధం కాదు. అప్పటిదాకా ఆటోడ్రైవర్ల బృందంతో ఉన్న మహానంద్.. మిత్రులు కునుకుతీస్తుండటంతో.. అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. గులాబీని హత్య చేసి వచ్చి తాపీగా వాళ్ల మధ్యలో పడుకున్నాడు. పోలీసులు లోతుగా విచారించకపోవడంతో మరిన్ని దుర్మార్గాలు జరిగాయి. అప్పట్లో గులాబీ ఎదురింట్లో ఉండేవాడు మహానంద్. ప్రేమిస్తున్నట్టు నటించి వంచించాడు. ప్రాణాలు తీశాడు. అదే మొదటి హత్య. అప్పటికి వయసు పాతిక. పోలీసులకు దొరికేవరకూ.. నిర్భయంగా బతికేశాడు.
మహానంద్ పథకం ప్రకారం పేదలు నివసించే ప్రాంతాల్లో తిరిగేవాడు. ఎవరేమిటో ఆరా తీసేవాడు. ఎర్రగా బుర్రగా ఉండేవాళ్లను ఎంచుకునేవాడు. వాళ్లు బయటికి వచ్చినప్పుడు బస్ షెల్టర్లు, మార్కెట్లు, ఇండస్ట్రియల్ ఏరియాల వద్ద మాట కలిపేవాడు. తనను తాను బిజినెస్ మ్యాన్‌గా పరిచయం చేసుకునేవాడు. ఆ మహిళల పేరుకు మ్యాచ్ అయ్యేలా తన పేరు మార్చుకునేవాడు. గోవింద్ అనే పేరుతో గులాబీతో పరిచయం పెంచుకున్నాడు. యోగిత కోసం యోగేశ్‌గా మారాడు. తొలి పరిచయంలో ఐస్‌క్రీమ్ తినిపించడం తన అలవాటు. కొంతకాలం తర్వాత శారీరక సంబంధం ఏర్పరుచుకుంటాడు. తన పెళ్లి నిర్ణయం కన్నవాళ్లదేనని
చెబుతాడు. ఇంటికి రమ్మంటాడు. ప్రియుడి కుటుంబానికి నచ్చేలా ఆ మహిళ ఉన్నంతలో మంచి ఆభరణాలు ధరించి వెళ్తుంది. ఎవరూ లేని చోటికి తీసుకెళ్లి ఆమె దుపట్టానే మెడకు బిగించి చంపుతాడు. నగలు, డబ్బుతో పారిపోతాడు. అన్ని హత్యలూ ఇదే తరహాలో చేశాడు. ఒక్క గులాబీని మాత్రమే తలపై రాయితో మోది చంపాడు. ఆ బంగారాన్ని స్వర్ణకారుల దుకాణానికి తీసుకుపోయేవాడు. కుటుంబసభ్యులకు అనారోగ్యమనీ, దవాఖానలో చేర్పించాలనీ కట్టు కథలు చెప్పి అమ్మేసేవాడు. మహానంద్కు ఇప్పుడు 54 సంవత్సరాలు. పద్నాలుగేళ్లు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యనే పెరోల్ వచ్చింది. ఆ దుర్మార్గుడిని విడుదల చేయవద్దంటూ మృతుల బంధువులు
పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయినా మహానంద్ బయటికి రానే వచ్చాడు. మహానంద్ నేరచరిత ఆధారంగా ‘మహానంద్.. మనిషి కాదు సైతాన్’ అనే నాటకమూ వచ్చింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఇంగ్లండ్‌లో ఈ నాటకం ప్రదర్శించారు. ప్రదర్శన తిలకించేందుకు గోవా ప్రజలూ ఆసక్తి చూపారు. ఏ నాటకానికైనా ‘శుభం’ ఉంటుంది. కానీ ఈ జీవన్నాటకానికి మాత్రం ‘అశుభమే’. మహానంద్ మారాడనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
గోవా.. నీ నీడలో మృగాడు సంచరిస్తున్నాడు. యువతీ.. మోసపోవద్దు. తీపి కబుర్లకు కరిగిపోవద్దు. ఐస్‌క్రీమ్ రుచికి మైమరిచిపోవద్దు. ఇంటికి పిలిస్తే వెళ్లొద్దు. జాగ్రత్త.. జాగ్రత్త!