అమరావతి : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అనుమానాస్పద రీతిలో బీ-ఫార్మసీ విద్యార్థిని మృతి చెందింది. వ్యవసాయ పొలంలోని ఓ షెడ్డులో ఆమె ఉరి వేసుకుంది. ప్రేమించిన వ్యక్తే నమ్మించి హత్య చేశాడని తల్లిదండ్రుల ఆరోపిస్తుండగా ఆమెది ఆత్మహత్యేనని స్థానిక డీఎస్పీ రమాకాంత్ పేర్కొనడంపై మృతురాలి బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల మేరకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు.
పోలీసుల తీరుపై విద్యార్థిని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ మృతురాలి బంధువులు, వాల్మీకి సంఘాల నేతలు, మహిళా సంఘాలు పెనుకొండ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వాల్మీకి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చిన ఎస్పీ కారును బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితుడు సాదిక్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.