Suicide : భార్యభర్తల మధ్య గొడవలు వాళ్లిద్దరినీ విడిపోయేలా చేశాయి. ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏడాది గడిచింది. కానీ సమస్య సమసిపోలేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అయితే భార్యతో ఎడబాటును ఆ భర్త తట్టుకోలేకపోయాడు. జీవితం మీద విరక్తి చెందాడు. మానసికంగా కుంగిపోయాడు. చివరకు ఆత్మహత్య (Suicide) అనే తీవ్ర నిర్ణయం తీసుకుని ఉరేసుకున్నాడు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ నాయర్ (40), పూజా నాయర్ ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఏడాది క్రితం విడిపోయారు. ప్రశాంత్ నాయర్ ఒక టెక్ కంపెనీలో మార్కెటింగ్ నిపుణుడిగా పనిచేస్తున్నారు. పూజా నాయర్ కూడా ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ వేర్వేరుగా ఉంటూనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
కలిసి ఉందామన్న ప్రశాంత్ నాయర్ విజ్ఞప్తిని పూజా నాయర్ పెడచెవిన పెడుతూ వస్తోంది. దాంతో ఇక భార్య తనతో కలువదు అని నిర్ధారణకు వచ్చాడు. మానసికంగా తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. చివరికి తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ప్రశాంత్ నాయర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన కుమారుడు ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి చూశానని, వెళ్లే సరికి ఫ్యాన్ ఉరేసుకుని చనిపోయి ఉన్నాడని చెప్పాడు. భార్యభర్తల గొడవలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పేర్కొన్నాడు. ఈ విషయంలో తాను ఎవరినీ అనుమానించదల్చుకోలేదని తెలిపాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.