Varanasi : ఉత్తర ప్రదేశ్‌లోని, వారణాసి పట్టణంలో దారుణం జరిగింది. కాలేజ్ క్యాంపస్‌లో ఒక విద్యార్థిని తోటి విద్యార్థి పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఈ ఘటన వారణాసి పట్టణంలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీలో శుక్రవారం ఉదయం 11.00 గంటలకు జరిగింది. మృతుడు, హంతకుడు ఇద్దరూ అదే కాలేజీలో చదువుతున్నారు. వీరిలో మృతుడిని బీఏ చదువుతున్న సూర్యప్రతాప్ సింగ్‌గా, హంతకుడిని మంజీత్ చౌహాన్‌గా పోలీసులు గుర్తించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. వారణాసి సమీపంలోని శివ్‌పూర్‌కు చెందిన రిషిదేవ్ సింగ్, కిరణ్ సింగ్ దంపతుల కుమారుడు సూర్య ప్రతాప్ సింగ్. అతడు చదువు కోసం వారణాసిలో ఉంటున్నాడు.
ఈ క్రమంలో కాలేజీలో అతడికి, మంజీత్ చౌహాన్‌కు కొంతకాలంగా విబేధాలు చోటు చేసుకున్నాయి. అనేక సందర్భాల్లో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. సూర్య ప్రతాప్ సింగ్ చాలా టాలెంటెడ్ విద్యార్థిగా గుర్తింపు పొందాడు. ఇరువురి మధ్యా నెలకొన్న వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సూర్య ప్రతాప్ సింగ్‌ను మంజీత్ చౌహాన్ పిస్టల్‌తో అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. తలపై, ఛాతీపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం మంజీత్ చౌహాన్ అక్కడినుంచి పారిపోయాడు. బిల్డింగ్ పై నుంచి దూకి, బౌండరీ వాల్ దాటి వెళ్లిపోయాడు. ఈ సమయంలో పిస్టల్‌ను ఒక డస్ట్‌బిన్‌లో పారేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన సందర్భంగా అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు వెంటనే సూర్యప్రతాప్ సింగ్‌ను మల్దహియాలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బీహెచ్‌యూ ట్రామా సెంటర్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సింగ్ మరణించాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు, సిబ్బందిపై దాడి చేశారు. ఇద్దరు అధ్యాపకులు గాయపడ్డారు. వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయమైంది. వారిని పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఆస్పత్రికి తరలించారు. విద్యా్ర్థుల దాడిలో పలు వాహనాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. అసలు క్యాంపస్‌లోకి ఒక స్టూడెంట్ తుపాకి ఎలా తీసుకొచ్చారని చాలా మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో సూర్యప్రతాప్ సింగ్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. అతడి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు నిరాకరించారు. కానీ, పోలీసులు అతడి మృతదేహాన్ని ఉద్రిక్తతల మధ్య స్వస్థలానికి తరలించారు.
అయితే, నిందితుడిని ఎన్కౌంటర్ చేసేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని అతడి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. హంతకుడిని చంపాల్సిందే అంటూ పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో అటు కాలేజీ వద్ద, మృతుడి స్వస్థలం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు మంజీత్తోపాటు, ఘటన సమయంలో పక్కనే ఉన్న అతడి మరో స్నేహితుడు అనూజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.