మియాపూర్ : కూతురి కుటుంబ సమస్య గురించి మాట్లాడేందుకు వెళ్లిన మామపై అల్లుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన మియాపూర్ ఠాణా పరిధిలోని ఆదిత్యనగర్‌లో చోటు చేసుకున్నది. వివరాల ప్రకారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మియాపూర్ ఆదిత్యనగర్‌కు చెందిన ఆటో డైవర్ ఒమర్‌కు సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన రేష్మబేగంకు ఆరేండ్ల క్రితం వివాహం జరిగింది.
భార్యభర్తల మధ్య గత కొద్ది కాలంగా వివాదాలు కొనసాగుతుండగా…రేష్మబేగం తండ్రి షేక్ హఫీజ్(45) ఆదివారం ఉదయం ఈ విషయమై మాట్లాడేందుకు ఆదిత్యనగర్‌లోని ఒమర్ కుటుంబసభ్యుల నివాసానికి వెళ్లాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో మామపై ఆగ్రహం పెంచుకున్న ఒమర్ కత్తితో తలపై విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్త స్రావమై హఫీజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వెంకటేశ్ పేర్కొన్నారు.