కొడంగల్ : చిన్నపాటి నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో రెండు లారీలు ఢీకొన్నసంఘటన మున్సిపల్ శివారులోని ఎన్కెపల్లి గ్రామ స్టేజీ వద్ద శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ అందించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి లేడీస్ కార్నర్‌కు సంబంధించిన మెటిరియల్ లోడ్‌తో కెఏ32సి7449 గల లారీ హైదరాబాద్‌కు వెలుతుండగా, కాళేశ్వరం నుంచి ఇసుక లోడ్‌తో టీఎస్05 యుబీ 0279 లారీ కొడంగల్ వైపు వస్తుంది. ఈ క్రమంలో కర్ణాటక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకోట్టింది.
దీంతో కర్ణాటక లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆరీఫ్, క్లీనర్ షెక్సోయబ్, ఇసుక లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ కెతావత్ సేన్యా, డేగావత్బాబు, సోమ్లా, గణేష్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢీకొన్న రెండు లారీలు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరుక్కపోయిన రెండు లారీలను క్రేన్ సహాయంతో గంటలకు పైగా శ్రమించి వేరుచేసి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయాలైన వారికి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. కాగా రెండు లారీల డ్రైవర్ల పరిస్థితి విషమం కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇసుక లారీలో ప్రయాణిస్తున్న గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.