బంజారాహిల్స్ : మేకప్ చేసేందుకు ఇంటికి వచ్చిన ఓ బ్యూటీషీయన్ రూ.5లక్షల విలువైన వజ్రపు ఉంగరాన్ని తస్క రించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఎన్. వైశాలివీరెడ్డి అనే మహిళ అర్బన్ క్లాప్ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా బ్యూటీషియన్ సేవలు కావాలని స్లాట్ బుక్ చేసుకుంది.
దాంతో రయీసా బాను అనే బ్యూటీషియన్‌ను ఇంటికి పంపిస్తున్నామని సంస్థ ప్రతినిధులు చెప్పారు .ఈ మేరకు బుధవారం ఉదయం 11గంటల ప్రాంతంలో వైశాలి వీ రెడ్డి ఇంటికి వచ్చిన రయీసా బాను సుమారు 20 నిమిషాల్లో మేకప్ పని ముగించింది. వైశాలి మంచినీళ్లు తాగేందుకు లోనికి వెళ్లి వచ్చేసరికి అక్కడ పర్సులో ఉంచిన వజ్రపు ఉంగరాన్నితస్కరించి జేబులో వేసుకుని బయటకు వెళ్లిపోయింది.
వైశాలి బయటకు వచ్చి చూడగా పర్సులో ఉండాల్సిన వజ్రపు ఉంగరం కనిపించలేదు. దాంతో సీసీ ఫుటేజీని పరిశీలించగా టేబుల్మీద ఉన్న పర్సులోంచి ఉంగరాన్ని కొట్టేసినట్లు తేలింది. ఈ మేరకు గురువారం బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉంగరం విలువ రూ.5లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.