RPF | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు భారీగా మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) పట్టుబడినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ నార్కో కింద తనిఖీలు నిర్వహించామన్నారు. మొత్తం 37 తనిఖీల్లో రూ. 2.7 కోట్ల విలువ చేసే 1,084 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో మొత్తం 36 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
డ్రగ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రైళ్లలో తరలించడం, స్టేషన్ పరిసరాల్లో విక్రయించడం వంటి వాటిపై నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశామన్నారు. 2023 ఏడాదిలో 22.2 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తు చేశారు. డ్రగ్స్ వల్ల యువత చెడిపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు.