బెంగళూర్ : మహిళ పట్ల ఆదివారం రాత్రి అభ్యంతరకరంగా వ్యవహరించిన అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. యలహంక న్యూ టౌన్ వద్ద వీధికుక్కలకు ఆహారం తినిపిస్తున్న యువతి (26) పట్ల హెడ్ కానిస్టేబుల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు తన ఇంటి వద్ద వీధికుక్కలకు ఆహారం తినిపిస్తున్న సమయంలో యలహంక న్యూటౌన్ సమీపంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసించే నిందితుడు చంద్రశేఖర్ ఆమెవైపు చూస్తూ తన మొబైల్ టార్చ్‌లైట్ స్విచాన్ చేసి తన ప్యాంట్ వద్ద చూపుతూ ఫ్లాష్ చేశాడు.
దీంతో ఆ సమయంలో మహిళ అటుగా వెళుతున్న వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ చర్యను ఫోన్లో రికార్డు చేయాలని కోరింది. నిందితుడి దుశ్చర్యను అతడు రికార్డు చేస్తుండగా వీడియోను డిలీట్ చేయాలని నిందితుడు బెదిరించాడు. తాను హెడ్కానిస్టేబుల్నని తనను ఎవరూ ఏమీ చేయలేరని రెచ్చిపోయాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో కీచక కానిస్టేబుల్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. నిందితుడు చంద్రశేఖర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.