నిర్మల్ : జిల్లాలోని భైంసా డివిజన్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు డివిజన్లో ఆరు కేసులు నమోదు కాగా వారం క్రితం కుబీర్ మండలంలో ఒకరు చనిపోయారు. మిగతా ఐదుగురు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తాజాగా సోమవారం భైంసా పట్టణంలోని రాహుల్ నగర్లో నివాసం ఉంటున్న కోతుల్గాం గ్రామానికి చెందిన గజన్ బాయి (62) బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందింది.
ఆమెకు గత ఏప్రిల్ నెల 14 తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ రావడంతో పట్టణంలోని ఓ దవాఖానలో చికిత్స పొందిన తర్వాత ఈ నెల 5వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.
కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ దవాఖానలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో ఐదు రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ దవాఖానలో పరీక్షలు చేపిస్తే బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారణ అయింది.
ఆమెకు చికిత్స చేయాలనుకుంటే ఇమ్యూనిటీ పవర్ లేకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.