న్యూఢిల్లీ : ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, అదే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆ యువతి ప్రయివేటు భాగాల్లో ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ముగ్గురు డాక్టర్లతో ఏర్పాటు చేసిన ప్యానెల్.. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం రాత్రి బాధితురాలిని సుల్తాన్‌పురి నుంచి కాంజావాలా వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ నెల 1న తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లి చంపేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రమాదంలో జరిగిన సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు ఢిల్లీ గుర్తించిన పోలీసులు.. సీసీ పుటేజ్ ఆధారంగా ట్రేస్ చేసి ఆమెను సుల్తాన్‌పురి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి ఆమె నుంచి వివరాలు రాబడుతూ.. వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు.
పోలీసులు విచారణలో యువతి ఏం చెప్పిందనేది వెల్లడికావాల్సి ఉంది. జనవరి 1న తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తున్న అంజలి అనే యువతిని దుండగులు కారుతో ఢీకొట్టారు. స్కూటీ కారులో ఇరుక్కున్నా అలాగే 13 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. స్కూటీ కారు నుంచి వేరుపడిన తర్వాత పారిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి చివరికి ప్రాణాలు కోల్పోయింది.