ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిర్భయ తరహా ఘటన కలకలం రేపింది. సబర్బన్ సకినాక ప్రాంతంలో టెంపో వాహనంలో 34 ఏండ్ల మహిళపై లైంగిక దాడి జరిపి ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్‌తో గాయపరిచిన దారుణ ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు మోహన్ చౌహాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బాదితురాలిని దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మహిళ నిస్సహాయ స్థితిలో కనిపించిందని సమాచారం రాగా ఘటనా స్ధలానికి వెళ్లామని, అక్కడ రక్తపు మడుగులో బాధితురాలు పడి ఉందని చెప్పారు. మహిళను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి ఘటన జరిగిన గంటలోపలే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన టెంపోలో ఈ దారుణం జరిగిందని చెప్పారు. టెంపోలో రక్తపు మరకలు కనిపించాయని తెలిపారు.