న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని సాయం కోరిన మైనర్ బాలికపై పొరుగున ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈనెల 22న ఈ ఘటన జరగ్గా మరుసరి రోజు బాధితురాలు ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలిక తండ్రి గ్రామానికి వెళ్లగా అస్వస్ధతతో బాధపడుతున్న తల్లితో కలిసి బాలిక నివసిస్తోంది. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో బాలిక పొరుగింటి వ్యక్తిని సాయం కోరింది. మందులు కొనిస్తానని నమ్మబలికిన నిందితుడు అరుణ్ ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరో ఘటనలో ఢిల్లీలో ఇంటి బయట ఆడుకుంటున్న తొమ్మిదేండ్ల బాలికను పొరుగున ఉండే ఇద్దరు మైనర్ బాలురు సమీపంలో ఖాళీగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.