హైదరాబాద్‌లో మరో కులోన్మాద హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో ఓ వ్యక్తిని నలుగురు దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన బేగంబజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.
బేగంబజార్‌లోని మచ్చీ మార్కెట్ సమీపంలోని ఆర్.ఎస్ ఎంటర్ ప్రైజెస్ ప్లాస్టిక్ షాప్ ఎదురుగా నీరజ్ పన్వార్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడిచేశారు. ఏడాదిక్రితం ప్రేమవివాహం చేసుకున్నాడని యువతి కుటింబీకులు కక్షగట్టారు. అదే కక్షతో పన్వార్‌పై కత్తులతో దాడిచేసినట్లు సమాచారం. నీరజ్ పన్వార్‌ను దుండగులు దాదాపు 20సార్లు కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.