Cyber Crime | ముంబై : ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు అధికమైపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఓ మహిళ ఆన్లైన్లో శోధించి, రూ. 1.5 లక్షలు పోగొట్టుకున్నది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో ఓ మహిళ పని చేస్తోంది. సెంట్రల్ ముంబై పరిధిలోని చెంబూరులోని ఓ హాస్పిటల్ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆమె ఆన్లైన్లో శోధించింది. ఓ హాస్పిటల్ అడ్రస్‌తో ఉన్న మొబైల్ నంబర్‌కు ఆమె కాల్ చేయగా, మొదట కొంత డబ్బు కట్ అయింది. కాసేపటికే రూ. 1.5 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ అయినట్లు ఆమెకు మేసేజ్ వచ్చింది. దీంతో మళ్లీ బాధితురాలు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.