ఖమ్మం : పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే వనమా రాఘవను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించగా, తాజాగా రామకృష్ణ తల్లి సూర్యవతి, సోదరి మాధవిని అరెస్టు చేశారు. ఏ-3, ఏ-4గా రామకృష్ణ తల్లి, సోదరి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లి, సోదరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఇద్దరిని ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు శనివారం ఉదయం హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో వనమా రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని వనమా రాఘవ పోలీసుల ముందు ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపిన విషయం తెలిసిందే. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వనమా రాఘవ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. వనమా రాఘవపై ఈ కేసుతో పాటు మరో 12 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.
పాత పాల్వంచలో ఈ నెల 3న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నాగ రామకృష్ణ, అతడి వైఫ్ శ్రీలక్షి. కూతుళ్లు. సాహితి. సాహిత్య. ఈ నలుగురు చనిపోయారు. ఈనెల 3న ఉదయం రామకృష్ణ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి అంటించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద కూతురు సాహిత్య.. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. రామకృష్ణ బావమరిది జనార్ధన్ రావు ఫిర్యాదు ఆధారంగా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. సాహిత్య కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటనాస్థలిలో లభించిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ ద్వారా వనమా రాఘవ, తన తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. వనమా రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.