Drugs | మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2.5 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి.. బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద ఎండీఎంఏ రకం డ్రగ్స్ లభించినట్లు ఎస్టీఎఫ్ ఎస్ఐ పవన్ రెడ్డి పేర్కొన్నారు.
బెంగళూరు నుంచి కిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కిరణ్.. క్రాంతి, మహ్మద్ షోయల్ అనే యువకులకు విక్రయించినట్లు తేలింది. వీరిద్దరూ ఆ డ్రగ్స్‌ను విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 2.5 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. డీపీఈవో షేక్ పతియాజోద్దీన్, ఏఈవో కే మాదవయ్య, డీటీఎఫ్ సీఐ నర్సిరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేయగా, డ్రగ్స్ పట్టుబడినట్లు ఎస్ఐ పవన్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్‌తో పాటు ఇతర అధికారులు అభినందించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రావు, కానిస్టేబుల్స్ చెన్నయ్య, శ్రీనివాస్, జ్యోతి బృందం పాల్గొన్నారు.