Srisailam | ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు గల సామాన్య భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత సామూహిక సేవలు జరిపించుకునే అవకాశం శ్రీశైలం దేవస్థానం కల్పిస్తున్నది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన భక్తుల సౌకర్యార్థం ఈ వసతి కల్పించింది. ప్రతి నెలా ఒక రోజున జరిగే ఈ సేవలో 250 మంది భక్తులు పాల్గొన వచ్చు. అయితే, ఈ సామూహిక సేవలో పాల్గొనాలని భావించే భక్తులు www.srisailadevasthanam.org ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు.. మంగళవారం అంటే ఈ నెల 25న ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు సామూహిక అభిషేకాలతో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. చంద్రవతి కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సామూహిక అభిషేకం కోసం 250 మంది భక్తులు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
సామూహిక అభిషేకంలో పాల్గొన్న భక్తులకు అభిషేకం తర్వాత ప్రత్యేక క్యూ లైన్ ద్వారా శ్రీ స్వామి వారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సేవాకర్తలకు రెండు లడ్డూ ప్రసాదాలు, కుంకుమ, విభూది, కైలాస కంకణాలు, శ్రీశైల ప్రభ, కాటన్ కండువా, రవిక వస్త్రం అంద చేస్తారు. శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత దేవస్థానం అన్నపూర్న భవనంలో భోజన వసతి కల్పిస్తారు.
వచ్చేనెల (జ్యేష్ఠమాసం) 12న, శ్రవణ నక్షత్రం సందర్భంగా సామూహిక కుంకుమార్చన, జూన్ 12న (ఆషాడ మాసం) ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మ్రుత్యుంజయ హోం, ఆగస్టు 25న (శ్రావణ మాసం) వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రావణ వరలక్ష్మీ వ్రతాలు, సెప్టెంబర్ 18న (భాద్రపద మాసం) వినాయక చవితి సందర్భంగా గణపతి పూజ, అక్టోబర్ 27న (ఆశ్వయుజ మాసం) చతుర్దశి (శుక్రవారం) చండీహోమం, నవంబర్ 30న (కార్తీక మాసం) ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం, డిసెంబర్ 27న (మార్గశిర మాసం) ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 2024 జనవరి 25న (పుష్యమాసం) పుష్యశుద్ధ పౌర్ణమి సందర్భంగా రుద్రహోమం, 2024 ఫిబ్రవరి 16న (మాఘ మాసం) మాఘ శుద్ధ సప్తమి (రధ సప్తమి) సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.