బెంగళూరు: ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెపై సలసల కాగిన నూనె పోశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. అడుగోడి ప్రాంతంలోని ఎల్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న 38 ఏండ్ల థామస్, జనవరి 31న ఉదయం తన భార్య ఆంటోనియమ్మను హత్య చేయాలని నిర్ణయించాడు. నీటిని వేడి చేస్తున్నానని భార్యకు చెప్పిన అతడు వంట గదిలోకి వెళ్లాడు. అయితే ఒక పెన్నంపై నూనె పోసి కాగపెట్టాడు. అనంతరం బయట కూర్చొన్న భార్య తలపై ఒక చెక్కతో కొట్టాడు. దీంతో ఆమె అచేతనంగా ఉండిపోయింది. ఆ వెంటనే వంటగదిలోకి వెళ్లి కాగిన నూనె తెచ్చి భార్య శరీరంపై పోశాడు.
ఈ గొడవకు నిద్ర లేచిన 13 ఏండ్ల కుమార్తె, తండ్రి బారి నుంచి తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది. దీంతో కుమార్తె చేతిపై కూడా కాగిన నూనెను అతడు పోశాడు. భయాందోళన చెందిన తల్లీకూతుళ్లు గట్టిగా కేకలు వేశారు. వారి అరుపులు విన్న పొరుగు వారు వెంటనే ఆ ఇంటికి రాగా ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
ఇరుగు పొరుగు వారు సమయానికి రావడంతో ఆంటోనియమ్మ ప్రాణాలు దక్కాయి. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.