న్యూఢిల్లీ : వర్క్ ఫ్రం హోం ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) అమాయకులను ట్రాప్ చేసి అందినకాడికి ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచే ఖాళీ సమయంలో పనిచేస్తే అధిక మొత్తం సంపాదించవచ్చని గత కొద్దినెలలుగా కేటుగాళ్లు ప్రజలను లక్షల రూపాయలకు ముంచేస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్‌లోని మొరైయ ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి స్కామర్లు రూ. 40 లక్షలు దోచేశారు. ఇంటి నుంచి పనిచేస్తూ సులభంగా సంపాదించవచ్చని 3డీ డిజైనర్ దేవాంగ్ చౌహాన్‌ను మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు నకిలీ ఆఫర్‌తో నలభై లక్షలు కాజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న చౌహాన్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి పార్ట్‌టైం జాబ్ ఆఫర్ చేస్తూ కాల్ వచ్చింది. యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి, ప్రమోట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని కాలర్ మభ్యపెట్టాడు. వీడియోలను చూడటం, ఆయా యూట్యూబ్ చానెళ్లకు సబ్‌స్ర్కైబ్ చేయడం ద్వారా ఒక్కో వీడియోకు రూ. 50 చెల్లిస్తామని చెప్పాడు. బాధితుడిని నమ్మించేందుకు ముందుగా స్కామర్లు రూ. 150 అతడి ఖాతాలో జమ చేశారు. ఆపై బాధితుడిని టెలిగ్రాం గ్రూప్‌లో చేర్చారు.
ఇక అప్పటినుంచి టాస్క్‌ల పేరుతో అతడిచే కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టించి రిటన్స్గా కొంత మొత్తం చెల్లిస్తూ నమ్మకాన్ని చూరగొన్నారు. ఆ తర్వాత అధిక రిటన్స్ వస్తాయని పలు టెలిగ్రాం గ్రూపుల్లో అతడిని జాయిన్ చేసి రూ. 40 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయించారు. ఎంతకీ రిటన్స్ రాకపోవడంతో స్కామర్లను నిలదీయగా వాటిని తిరిగి పొందేందుకు మరింత మొత్తం ఇన్వెస్ట్ చేయాలని నమ్మబలికారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More :