QR Code Scam : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్న స్కామర్లు అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. బెంగళూర్‌కు చెందిన ఓ ఇంజనీర్‌ను స్కామర్లు ఓఎల్ఎక్స్ క్యూఆర్ కోడ్ స్కామ్‌లో రూ. 2 లక్షలకు మోసగించారు. బయ్యర్లా నమ్మబలికిన స్కామర్ తప్పుడు క్యూఆర్ కోడ్స్‌ను పంపి భారీ మొత్తం దోచుకున్నాడు. ఆన్లైన్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన వెల్లడిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిద్ధార్ధ్ (27) ఆగస్ట్ 29న తన ఎయిర్ కూలర్‌ను విక్రయించాలని నిర్ణయించుకుని రూ. 5200 ప్రైస్ ట్యాగ్‌తో ఓఎల్ఎక్స్లో లిస్ట్ చేశాడు. యాడ్‌ను పోస్ట్ చేసిన కొద్దినమిషాలకే వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఫర్నీచర్ షోరూం యజమాని శ్రీకాంత్ వర్మగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. కూలర్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉందని వర్మ తెలిపాడు. ఈ క్రమంలో వర్మ సిద్ధార్ధ్‌కు రూ. 5లకు క్యూ ఆర్ కోడ్ పంపాడు.
కోడ్‌ను స్కాన్ చేయాలని కోరగా, సిద్ధార్ధ్ అలాగే చేయగా రూ. 5 చెల్లింపు పూర్తయింది. ఆపై వర్మ రూ. 5200కు మరో క్యూఆర్ కోడ్ పంపాడు. అయితే తనకు ఈ మొత్తం రావాల్సి ఉండగా తన ఖాతా నుంచి అంతే మొత్తం డెబిట్ కావడంతో సిద్ధార్ధ్ కంగుతిన్నాడు. అయితే ఇది సాంకేతిక లోపమని నమ్మబలికిన వర్మ రూ. 5200కు మరో క్యూఆర్ కోడ్ పంపాడు. అయితే ఈసారి రూ. 5200కు బదులు సిద్ధార్ధ్ ఖాతా నుంచి భారీ మొత్తం డెబిట్ అయింది. ఇలా ప్రతి క్యూఆర్ కోడ్‌లోనూ సిద్ధార్ధ్ డబ్బు పోగొట్టుకున్నాడు. ఈ స్కామ్‌లో సిద్ధార్ధ్ ఏకంగా రూ. 1.9 లక్షలను తన బ్యాంక్ ఖాతాల నుంచి పోగొట్టుకున్నాడు. ఆపై మోసపోయానని గ్రహించిన సిద్ధార్ధ్ స్దానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :