లక్నో : యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు ప్రేమ్‌కుమార్ అత్తమామల భూమిలో తన భార్య వాటాను కట్నం కింద ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు వారు నిరాకరించడంతో అత్త, భార్యను నెట్టివేసి గాయపరిచాడు. ఆవేశంతో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతు కోసి ఉసురు తీశాడు. అత్త ఎదుటే దారుణానికి పాల్పడిన నిందితుడు ఆపై పరారయ్యాడు.
గ్రామస్తులు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కట్నం కింద భూమి ఇవ్వాలని ప్రేమ్‌కుమార్ భార్యను ఒత్తిడి చేస్తున్నాడని, భూమిలో వాటా రాకపోవడంతో కోపంతో ఆమెను హత్య చేశాడని ఘజీపూర్ ఎస్పీ గోపీనాధ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.