లక్నో : తరచూ పుట్టింటికి వెళతానంటోందని కట్టుకున్న భార్యనే కడతేర్చిన ప్రబుద్ధుడి ఉదంతం యూపీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు కలీం అలీ (24)కి రెండేండ్ల కిందట షమా (22)తో వివాహమైంది. ఆమె తరచూ పుట్టింటికి వెళుతుండటం పట్ల అలీ ఆగ్రహం పెంచుకున్నాడు. షహరన్‌పూర్ జిల్లాలోని తెలిపుర ప్రాంతంలోని పుట్టింటికి వెళతానంటూ షమా కోరడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది.
భార్య తీరుపై ఆవేశంతో అలీ ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఇంటిలోనుంచి షమా అరుపులు, కేకలు వినిపించాయని తాము వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉందని స్ధానికులు తెలిపారు. అదే సమయంలో ఇప్పుడు వెళ్లు మీ పుట్టింటికి అంటూ నిందితుడు అలీ బయటకువచ్చాడని వారు చెప్పుకొచ్చారు. నిందితుడు అలీపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.