లక్నో : అతనో కామాంధుడు.. ఒకరిద్దర్నీ కాదు.. ఏకంగా వందల మంది మహిళలను, అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. అది కూడా 36 జిల్లాలకు చెందిన మహిళలను, యువతులను లైంగికంగా వేధించాడు. ఆ కామాంధుడి ఆగడాలను భరించలేక.. బాధితులంతా వుమెన్ పవర్ లైన్‌కు ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాఘవేంద్ర మౌర్య గత కొంతకాలం నుంచి మహిళలను, యువతులను టార్గెట్ చేశాడు. తన కంట పడ్డ మహిళలతో పాటు వివిధ మార్గాల ద్వారా పరిచయమైన వారి ఫోన్ నంబర్లను సేకరించాడు. ఇక వారికి అసభ్యకరమైన సందేశాలు పంపడం, వారితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడం చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. మౌర్య వెకిలి చేష్టలు భరించలేని బాధిత మహిళలు, అమ్మాయిలు 1090 వుమెన్ పవర్ లైన్‌కు 113 ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ 36 జిల్లాల నుంచి దాదాపుగా ఒకే సమయంలో వచ్చాయి. దీంతో పోలీసులు మౌర్యపై దృష్టి సారించి అరెస్టు చేశారు. మౌర్య అరెస్టు అయిన సమయంలో అతని ఫోన్‌ను చెక్ చేయగా, 200 కాంటాక్ట్‌లు మహిళలవే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.