భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని బాధితురాలి తండ్రి హతమార్చి అతడి మృతదేహాన్ని ముక్కలుగా కోసి నదిలో పడవేయడం కలకలం రేపింది. అజ్నల్ నదిలో ఆదివారం వ్యక్తి మృతదేహం బయటపడింది.
జిల్లా కేంద్రం నుంచి ఈ నది 40 కిలోమీటర్ల దూరంలో ఉందని సక్తాపూర్ గ్రామానికి చెందిన మృతుడిని(55) త్రిలోక్చంద్గా గుర్తించినప్పటి నుంచి మృతదేహం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మృతుడు మైనర్ బాలికను (14) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు వెల్లడైందని చెప్పారు.
బాలికను వేధిస్తున్న త్రిలోక్చంద్ (55)ను బాధితురాలి తండ్రి, మేనమామ శనివారం తమ బైక్పై కూర్చుండబెట్టుకుని అజ్నల్ నది వద్దకు తీసుకువెళ్లారు. ఆపై తల తెగనరికి మొండేన్ని చేపలు కోసే పరికరంతో రెండు ముక్కలు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, ఇతరుల పాత్రపైనా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు, మృతుడు బంధువలని గుర్తించామని పోలీసులు తెలిపారు.