Mumbai Police : చోరీల్ని అడ్డుకోవాల్సిన పోలీసులే దొంగతనానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. చోరీకి పాల్పడ్డ నలుగురు పోలీసుల్ని తాజాగా అరెస్టు చేశారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో బంగ్లాదేశీయులు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గత నెలలో ముంబైలోని యాంటీ టెర్రరిజం సెల్ విభాగం, ఆర్సీఎఫ్ పోలీస్ స్టేషన్లో పని చేసే పోలీసులు కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల ఇండ్లలోకి వెళ్లి మరీ సోదాలు చేశారు. ఈ క్రమంలో నలుగురు పోలీసులు ఒక మహిళ ఇంట్లోని బంగారం, డబ్బును తీసుకెళ్లారు. దీనిపై ఒక సోషల్ యాక్టివిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంతర్గత విచారణ చేశారు. ఈ విచారణలో పోలీసులు నేరానికి పాల్పడ్డట్లు రుజువైంది. దీంతో చోరీకి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఒక అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్తోపాటు, ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పందించారు.
ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని, అనంతరం నిందితులపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అరెస్టైన పోలీసులు ఇంకా కస్టడీలోనే ఉన్నట్లు చెప్పారు. చట్టానికంటే ఎవరూ ఎక్కువ కాదని అన్నారు. అయితే, ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారుల ఎవరూ అధికారికంగా స్పందించడం లేదు.