భోపాల్: పశువుల చోరీపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్ద దూడలతో నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహోలి గ్రామంలో నివసిస్తున్న దౌలత్ పాల్‌కు చెందిన ఐదు గేదెలు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లాయి. అయితే మూడు రోజులైనా అవి తిరిగి రాలేదు. దీంతో దౌలత్ పాల్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన పశువులు చోరీ అయ్యాయంటూ ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు.
దీంతో దౌలత్ పాల్ వినూత్నంగా నిరసన తెలిపాడు. దూడలు, గ్రామస్తులతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాడు. తమ ప్రాంతంలో పశువుల దొంగతనాలు ఎక్కువయ్యాయని ఆరోపించాడు. బ్యాంకు నుంచి 3.5 లక్షల రుణం తీసుకుని గేదెలను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. వాటిని ఎవరో ఎత్తుకుపోయారని, ఆ అప్పు ఎలా తీర్చాలి అంటూ వాపోయాడు.
కాగా, దూడలు, గ్రామస్తులతో దౌలత్ పాల్ వినూత్న నిరసనకు పోలీసులు దిగి వచ్చారు. అతడి గేదెల చోరీపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.