హైదరాబాద్ : అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్మెంట్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకుని ఆ పసిపాప ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డను తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయారు. పసిపాప ఏడుపు విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సాయికుమార్ తన బృందంతో ఆ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. శిశువును చూసి చలించిపోయారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం శిశువును ఎస్ఐ సాయికుమారే.. 108 అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. పాపకు డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతోంది. ఆ శిశువు తల్లిదండ్రుల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.