ఉస్మానియా యూనివర్సిటీ : మ్యాట్రిమోనీలో పరిచయమై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి తనతో సహజీవనం చేసి ముఖం చాటేసాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి రోదిస్తోంది. ఓయూ ఆర్ట్స్‌కళాశాల ఆవరణలో సోమ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదరు యువతి (30) మాట్లాడుతూ 2019లో భారత్ మ్యాట్రిమోనీలో బీవీడీ విజయ్‌కుమార్ (37) పరిచయమయ్యారని చెప్పారు.
విజయ్‌కుమార్ ఓయూలో పీహెచ్డీ పూర్తి చేసి, ఐఐసీటీలో ఇంటర్న్‌షిప్ చేసి, రెడ్డి ల్యాబ్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా రని అన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నామని, తమ ఇళ్లల్లో పెద్దలను సైతం ఒప్పంచామని చెప్పారు. దీంతో నాలుగు నెలలు సహజీవనం చేశామన్నారు.
పెళ్లి గురించి అడుగుతుండడంతో తనను దూరం పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతలో తన తండ్రి చనిపోవడంతో కొద్ది రోజులు గ్యాప్ వచ్చిందని, లాక్డౌన్ కూడా విధించడంతో తమ మధ్య మరింత దూరం పెరిగిందని అన్నారు. లాక్డౌన్ అనంతరం తనను కలిసినా, తనను మరిచిపోవాలని సూచించాడని చెప్పారు.
దాంతో తాను మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌కు పంపించారని వివరించారు. పోలీసులు విజయ్‌కుమార్‌ను పిలిపించి, కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించారని అన్నారు.
నెలలు గడుస్తున్నా ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు 420, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. దాంతో ఫోన్ నెంబర్, ఇళ్లు మార్చివేశాడని, ఉద్యోగానికి సైతం సెలవు పెట్టారని పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.