బేగంపేట్ : బేగంపేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దిన పత్రిక ఇంటర్నెట్ డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. శుక్రవారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
సీతాఫల్‌మండీకి చెందిన మధుసూదన్ (29) కొంత కాలంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఇంటర్నెట్ డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి తన ద్వీచక్ర వాహనంపై బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వెలుతుం డగా బేగంపేట్ మహిళ డిగ్రీ కళాశాల సమీపంలో కట్ట మైసమ్మ దేవాలయం ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు మధు సూదన్‌ను బలంగా ఢీ కొట్టి వెళ్లింది.
దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో మధుసూదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన స్థలంలో నూతన రోడ్డును వేసేందుకు కాంట్రాక్టర్ రోడ్డును పూర్తిగా చిప్పింగ్ చేసి ఉంచడంతో పాటు లారీ కూడా వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మృతి చెందిన మధుసూదన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.