భోపాల్ : మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. భగోరియా వేడుకల్లో ఇద్దరు మహిళలను బహిరంగంగా లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
సొన్వా ప్రాంతంలోని వల్పూర్ గ్రామ శివార్లలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. వైరల్ వీడియోలో మహిళలు ఓ వాహనం పక్కన నిలుచునిఉండగా పలువురు వ్యక్తులు వారి చుట్టూ మూగి పట్టపగలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలను అక్కడున్న వారు తమ ఫోన్లలో రికార్డు చేసినా వారిని కాపాడేందుకు మాత్రం ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ వీడియోలో సరుకు రవాణా వాహనం వెనుక నిలుచున్న మహిళలను ముద్దుపెట్టుకునేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
మహిళలు తప్పించుకునేందుకు ప్రయత్నించినా వారిని వెంటాడిన దుండగులు అందరిముందే లైంగికంగా వేధించారు. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకపోయినా వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే వారిని పట్టుకుంటామని అలిరాజ్పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు.