చెన్నై : మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా చెన్నైలోని లోకల్ ట్రైన్లో ఓ యువకుడు బరితెగించాడు. ఫిబ్రవరి 9న నంగంబక్కం నుంచి తాంబరానికి మహిళ లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 9న రాత్రి 9.40 గంటలకు నంగంబాక్కం నుంచి తాంబరం స్టేషన్‌కు ట్రైన్లో మహిళ ప్రయాణిస్తోంది.
ఆమె తాంబరం స్టేషన్‌కు వెళుతుండగా లేడీస్ కంపార్ట్మెంట్లో తన ఎదుట కూర్చున్న వ్యక్తి హస్త ప్రయోగం చేస్తుండటం గమనించింది. దీంతో మహిళ పెద్దగా కేకలు వేయడంతో అతడు రైలు నుంచి దూకి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని క్రోమ్‌పేట్‌లో అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు. సెంట్ థామస్ మౌంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో మహిళ పిర్యాదు చేశారు. నిందితుడిని లక్ష్మణన్గా పోలీసులు గుర్తించారు.
ఇక మొత్తం ఘటనను ఫిర్యాదిదారు తన సెల్ఫోన్లో రికార్డు చేసి ఆపై వీడియోను యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశారు. లేడీస్ కంపార్ట్మెంట్లోకి అతడు రావాల్సింది కాదు..అక్కడకు వచ్చినా ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడానికి అతడికి ఎంత ధైర్యం అంటూ ఆమె ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మీకు ఎదురైతే సిగ్గుపడకుండా సాయం కోసం అరవాలని..ఇది ఇతర మహిళల్లో మరింత అవగాహనను పెంచుతుందని ఆమె పేర్కొన్నారు.