లక్నో : యూపీలోని హర్దోయ్ జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలిక మృతదేహం ఆమె ఇంటి వెనుక లభ్యం కావడం కలకలం రేపింది. దుండగుడు బాధితురాలి గొంతును కత్తితో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. ఘటనా స్ధలంలో రక్తపు మరకలున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
గుర్తుతెలియని హంతకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి సమయంలో హత్య జరిగిందని, ఇది పరువు హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని హర్దోయ్ ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. బాధితురాలిని జఖ్వా గ్రామానికి చెందిన దేశ్రాజ్ కుమార్తె గోల్డీగా గుర్తించామని చెప్పారు.
బాధితురాలి మృతదేహం వద్ద రక్తపు మరకలున్న కత్తితో పాటు చెప్పుల జత, మొబైల్ ఫోన్, ఆముదం బాటిల్ కనిపించాయని తెలిపారు. బాధితురాలి సన్నిహిత ఫ్రెండ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.