చెన్నై : తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెపై రోజుల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను వసంత్ గిరీష్ (డెంటల్ స్టూడెంట్), రెజిత్ (వర్ధమాన నటుడు), ప్రసన్న (లెక్చరర్), విశాల్ (స్టూడెంట్)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక చదివే స్కూల్ సమీపంలో ఉండే షాపు వద్ద ఆమెతో పరిచయం పెంచుకున్న వసంత్ ఆపై తరచూ బాలికను తన ఇంటికి పిలిచేవాడు.
మత్తు మందు ఇచ్చి ఆపై పెండ్లి పేరుతో బాలికను లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అమ్మమ్మతో కలిసి నివసించే బాలిక రోజూ ఆమె నిద్ర పోగానే రాత్రి వేళ నిందితుడి ఇంటికి వెళ్లి ఉదయం 5 గంటలకు తిరిగి వస్తుండేది. ఇక బాలికకు గంజాయి అలవాటు చేసిన నిందితుడు రోజూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఓరోజు గంజాయి తాగిన తర్వాత బాలికపై నిందితుడుతో పాటు మరో ముగ్గరు అతడి స్నేహితులు లైంగిక దాడికి తెగబడ్డారు.
బాలిక తరచూ స్కూల్కు రాకపోవడంతో ఆమె అమ్మమ్మకు స్కూల్ టీచర్ సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది. దీంతో బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.