పింఛన్ డబ్బుల కోసం కొట్టుకున్న అన్నదమ్ములు
మద్యం మత్తులో అన్నను కొట్టి చంపిన తమ్ముడు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
పరారీలో నిందితుడు
దుండిగల్, డిసెంబర్ 26: పింఛన్ డబ్బుల విషయంలో అన్నదమ్ములు గొడవపడగా, తమ్ముడు అన్నను కొట్టి చంపాడు. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి.. వైజాగ్‌కు చెందిన వడవెళ్లి వెంకటశ్రీమన్నారాయణ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పనిచేసి.. పదవీ విరమణ పొందారు. కొన్నేండ్ల కిందట అతను చనిపోవడంతో భార్య వరలక్ష్మి తన ఇద్దరు కొడుకులు వెంకట మారుతి భరత్‌భూషణ్(35), సాయితేజాలతో కలిసి చర్చిగాగిళ్లాపూర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆమె కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ.. లేవలేని స్థితిలో ఉన్నారు. అయితే కొడుకులిద్దరూ ఏ పని చేయకుండా తాగి.. జులాయిగా తిరుగుతున్నారు. 24న సాయంత్రం మద్యం తాగిన అన్నదమ్ములు వెంకట మారుతి, సాయితేజా తన తల్లికి వచ్చే పింఛన్ డబ్బుల విషయమై ఘర్షణపడ్డారు. సాయితేజా అన్నను విచక్షణరహితంగా కొట్టడంతో అతడు మరణించాడు. భయపడిన సాయితేజా మృతదేహాన్ని మంచంపై ఉంచి..తలుపు వేసి పరారయ్యాడు. అనంతరం శనివారం తన స్నేహితుడికి విషయం చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మారుతి భరత్ భూషణ్ మృతదేహాన్ని గాంధీకి తరలించారు. నిందితుడు సాయితేజా పరారీలో ఉన్నాడు.