కామారెడ్డి : భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చిట్టపోయిన చంద్రశేఖర్(35)కు భార్యతో చాలారోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై చాలా సార్లు కులపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అయినప్పటికీ భార్యభర్తలు ఇద్దరూ ప్రతి రోజు గొడవ పడేవారు.
సోమవారం ఉదయం కూడా భార్యతో గొడవపడగా, పెద్ద మనుషులకు చెప్తానని భార్య ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో కోపంగా చంద్రశేఖర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మాల్కాపూర్ రోడ్డులోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పుటించుకున్నాడు. మంటలకు తాళలేక గట్టిగా అరిచాడు.
పక్కనే పోలీస్స్టేషన్ ఉండడంతో ఎస్సై సాయికుమార్, పోలీస్ సిబ్బంది, స్థానికులు గమనించి అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు. కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.