Husband Suicide | జయశంకర్ భూపాలపల్లి : భార్య పంపిన విడాకుల నోటీస్‌తో మనస్థాపం చెంది భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని జిల్లాలోని చల్లగరిగే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పినగాని శివరామకృష్ణ(34) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటి వద్ద ఉంటున్నాడు. భార్య గతేడాది కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.
ఈ క్రమంలో భార్య కూచన లక్ష్మి భర్త శివరామకృష్ణకు విడాకుల నోటీసు పంపించింది. కోర్టులో ఈ నెల 10న విడాకుల హియరింగ్ ఉంది. దీంతో మనస్థాపం చెందిన శివరామకృష్ణ ఈనెల 8న రాత్రి రోజువారిగా వేసుకునే మాత్రలను అధిక మొత్తంలో వేసుకోవడంతో అపస్మారస్థితిలోకి వెళ్ళాడు. దీంతో శివరామకృష్ణను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న శివరామకృష్ణ మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ వివరించారు.