Hyderabad | వెంగళరావునగర్, ఏప్రిల్ 3 : మా నాన్న కోరిక తీర్చాలంటూ కట్టుకున్న భార్యనే వేధించాడో భర్త. తన మాట వినకపోతే ఆమె నగ్న వీడియోలు, ఫొటోలను పోర్న్సైట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశౠడు. దగ్గరుండి కట్టుకున్న భార్యను తండ్రి బెడ్రూంలోకి పంపించాడు. ఇలా తరచూ వేధించడంతో తట్టుకోలేకపోయిన భార్య.. హైదరాబాద్ మధురానగర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్ గూడ జవహర్ నగర్ కు చెందిన వైద్యురాలైన యువతి (25)కు ఏడాదిన్నర క్రితం ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉండే యువకుడితో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల విలువైన ఇంటి సామగ్రి, 15 తులాల బంగారు ఆభరణాలతో పాటు అన్ని లాంఛనాలతో పెళ్లి జరిపించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ నమ్మించి సదరు యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన కొద్దిరోజులకే అతనికి ఉద్యోగం లేదని తెలిసింది. అయినప్పటికీ ఆ యువతి సర్దుకుపోయింది. దీంతో కొద్దిరోజులు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక పాప పుట్టింది. అప్పట్నుంచి వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఆడపిల్లను కన్నావు.. కొడుకును కనివ్వలేదంటూ వేధింపులకు దిగాడు.
ఈ క్రమంలోనే భార్య స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. ఆమె అడ్డుచెప్పినప్పటికీ వినకుండా నగ్న వీడియోలు తీశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అత్త కాలం చేసింది. ఆ తర్వాత నుంచి భార్య నగ్న వీడియోల్ని, ఫొటోల్ని అతను తన తండ్రికి చూపించేవాడు. అవి చూసిన మామ కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం కట్టుకున్న భర్తకు చెబితే.. ఆమెకు అండగా నిలబడాల్సిందిపోయి.. తండ్రికే సపోర్టుగా నిలిచాడు. తన తండ్రి కోరిక తీర్చాలని.. లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలను పోర్న్ సైట్లలో పెడతానని బెదిరించాడు. పంజాగుట్టలోని ఫ్లాట్ కూడా తన పేరునే రాయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు సదరు యువతిపై మామ అత్యాచారానికి యత్నించాడు. వాళ్ల చేష్టలతో విసిగిపోయిన సదరు యువతి తాజాగా మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది.
భర్త, మామ కలిసి చేసిన దారుణాలను పోలీసులకు చెప్పి ఫిరర్యాదు చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అని చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కానీ అతనికి ఉద్యోగం లేదని, పోర్న్ సైట్లలో యువతుల వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడని, మార్ఫింగ్ వీడియోల్ని ఎడిట్ చేస్తుంటాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.