అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టి గూడెంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. నిద్రపోతున్న మేకల కాపరి పర్వతాలు (60)ను దారుణంగా చంపి అతడి తల నరికి పట్టుకుపోయారు. ప్రతి రోజు మాదిరిగా మేకలను కాపేందుకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్న పర్వతాలను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.
ఇవాళ అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గుడిసె వద్ద పరిశీలించగా తల లేని మొండెంను గుర్తించి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు.