జైపూర్ : రాజస్ధాన్‌లోని కోటలో బజఖానా ప్రాంతంలోని ట్యూటర్ గృహంలో 15 ఏండ్ల బాలికను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాధిత బాలిక మూడేండ్లుగా ఆ టీచర్ వద్ద ట్యూషన్‌కు వెళుతోందని పోలీసులు తెలిపారు. రోజూలానే ఆదివారం కూడా ట్యూషన్‌కు వెళ్లిన బాలిక రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లితండ్రులు ట్యూటర్కు ఫోన్ చేశారు.
క్లాసు ఆలస్యమైందని ఆయన బదులివ్వగా కంగారు పడిన కుటుంబసభ్యులు ట్యూటర్ ఇంటి వద్దకు వెళ్లగా ఆ ప్రాంతంలో అపస్మారక స్ధితిలో తమ కూతరు పడిఉండటం కనిపించింది. బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలిక చేతులు కట్టిపడేసి ఉన్నాయని, ఆమె మెడ చుట్టూ తాడు బిగించి ఉందని, శరీరంపై పలుచోట్ల పెనుగులాడిన గుర్తులున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ట్యూటర్ ఇంట్లో బాలిక మృతదేహం కనిపించడంతో పోలీసులు ఫోరెన్సిక్ బృందాలతో ఘటనా స్ధలానికి చేరుకున్నారు. నిందితుడు గౌరవ్ జైన్ (28) పరారీలో ఉండగా అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు కర్యలు ముమ్మరం చేశారు. వైద్య నివేదికలు అందిన తర్వాతే నిందితుడు బాలికపై లైంగిక దాడి జరిపై ఆపై ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడా అనే విషయం వెల్లడవుతుందని డీఎస్పీ అమర్‌సింగ్ తెలిపారు.