Ghaziabad : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొరియన్ కల్చర్ వీడియోస్, మొబైల్ గేమ్స్‌కు బానిసైన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. తాము ఉంటున్న అపార్ట్మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్లో చేతన్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
ఈ క్రమంలో 12 ఏళ్లు, 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసు కలిగిన అతడి ముగ్గురు కూతుళ్లు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ అమ్మాయిలు ముగ్గురు రెండేళ్లుగా స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. ఇందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్తితి బాగోలేకపోవడ కూడా ఒక కారణమని స్థానికులు చెబుతున్నారు. చాలా కాలంగా ఇంట్లోనే ఉండటంతో కొరియన్ మూవీస్, డ్రామా వీడియోలకు బాగా అలవాటుపడ్డారు. అలాగే కొరియన్ కల్చర్‌కు సంబంధించి కొరియన్ లవర్ అనే మొబైల్ గేమ్‌కు కూడా బాగా అలవాటుపడ్డారు. ఈ గేమ్‌లోని టాస్క్‌లో భాగంగా అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ గేమ్ కారణం కాకపోవచ్చని పోలీసులు అంటున్నారు. కానీ, కొరియన్ డ్రామాల ప్రభావం ఉందని వారు చెబుతున్నారు. ఈ గేమ్స్, వీడియోస్‌కు వీరు ఎక్కువగా అలవాటుపడటం, ఎక్కువ సమయం మొబైల్లోనే గడిపేస్తుండటంతో వారి తండ్రి మొబైల్ ఇవ్వడం మానేశాడు.
మొబైల్ వాడకుండా నిషేధం విధించారు. దీంతో ఆ పిల్లలు ముగ్గురూ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఎనిమిది పేజీల సూసైడ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో తాము ఒంటిరవాళ్లం అనిపిస్తోందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని, తన తండ్రిని క్షమించమని వేడుకుంటూ లేఖ రాశారు. ఈ ఘటనతో ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ అంశం మరోసారి చర్చకు దారితీసింది.