వెంగళరావునగర్ : షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఖచ్చితమైన టిప్స్ చెప్తానంటూ ఓ విద్యార్ధిని అగంతకులు మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రగడ్డ నేతాజినగర్ 3వ వీధిలో విద్యార్థి కె.లోకసాయి కిరీటి నివాసముంటున్నాడు. ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ యాడ్ చూశాడు.
షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో మంచి లాభాలు వచ్చేందుకు ఖచ్చితమైన టిప్స్ చెప్తామంటూ ఉన్న యాడ్ క్లిక్ చేశాడు. దీంతో సోఫియా హాన్ అనే మహిళ పేరిట అగంతకుడు ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. సెబీలో నమోదైన లైసెన్స్డ్ ట్రేడర్‌గా తనకు తాను పరిచయం చేసుకున్నాడు. షేర్ ట్రేడింగ్‌లో ఖచ్చితమైన టిప్స్ చెప్పాలంటే డబ్బులు చెల్లించాలని పేర్కొనడంతో వారి ఖాతాకు గత నెల 16వ తేదీ నుంచి దశలవారీగా రూ.80 వేలు చెల్లించాడు.
మళ్లీ రూ.70 వేలు చెల్లించాలని చెప్పడంతో అనుమానం రావడంతో లోకసాయి కిరీటి అగంతకుడు చెప్పిన ఖాతాను పరిశీలించగా అది ముసారత్ పర్వీన్ అనే పేరిట నమోదై ఉన్నట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.