Nari Niketan : నోయిడాలోని మహిళా సంరక్షణ కేంద్రం నారీ నికేతన్‌లో పదిహేను రోజుల వ్యవధిలో నలుగురు మహిళలు అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. సెక్టార్ 34లో ఉన్న నారీ నికేతన్‌లో మొత్తం 122 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు.
డిసెంబర్ 20న షెల్టర్ హోంలో సునీత (50) మరణించగా మూడు రోజుల తర్వాత ఆరాధన (50) అనే మరో మహిళ మరణించారు. ఆపై డిసెంబర్ 30న ప్రియాంక (25), జనవరి 3న రూబీ (30) తనువు చాలించారు. షెల్టర్ హోంలో వరుస మరణాలపై జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ విచారణకు ఆదేశించారు.
మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని జిల్లా ప్రొబేషన్ అధికారి అతుల్ కుమార్ సోని తెలిపారు. షెల్టర్ హోంలో మహిళల వరస మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరణాల వెనుక కారణాలను నిగ్గుతేల్చాలని బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.